వైరస్ దాడిని గుర్తించి అదే వైరస్‌కు వ్యతిరేకంగా తన రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేసుకునే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ ఉత్పత్తి చేసే ఓ ఎంజైమ్.. బ్యాక్టీరియా కణంలోని సెన్సార్ ప్రోటీన్‌ను కత్తిరించడం ద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రక్రియలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బ్యాక్టీరియా తనను తాను నాశనం చేసుకుంటుంది. ఈ పరిశోధన యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేయడంలో సహాయపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సైన్స్‌డైలీ నివేదిక ప్రకారం.. బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేసే వైరస్‌లను బ్యాక్టీరియోఫేజ్‌లు లేదా ఫేజ్‌లు అంటారు. ఇవి హానికరమైన బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. మానవ కణాలకు హాని కలిగించకుండా బ్యాక్టీరియాను అంతం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలోనూ ఇవి ఉపయోగపడవచ్చు. అయితే, ఫేజ్‌ల దాడిని ఎదుర్కొనేందుకు బ్యాక్టీరియా కూడా ప్రత్యేక రోగనిరోధక వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంది. ఈ రక్షణ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా మరింత సమర్థవంతమైన చికిత్సలను రూపొందించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు CBASS అనే బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థపై దృష్టి సారించారు. వైరస్ దాడి జరిగినప్పుడు ఈ వ్యవస్థ క్రియాశీలమవుతుంది. వైరస్ ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు, వైరస్ సోకిన బ్యాక్టీరియా కణం తనను తాను నాశనం చేసుకునేలా చేస్తుంది. ఇది చివరి రక్షణ చర్యగా పనిచేస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ యూటా హెల్త్‌కు చెందిన బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సామ్ హాబ్స్, ఆయన సహచరులు ఈ ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందో గుర్తించారు. కొన్ని రకాల ఫేజ్‌లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్రోటీజ్ అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎంజైమ్ బ్యాక్టీరియాలోని కీలక ప్రోటీన్‌పై నేరుగా పనిచేస్తుంది. దాంతో ఏర్పడే మార్పు ఒక హెచ్చరిక సంకేతంలా పనిచేసి, CBASS రోగనిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తుంది.
సామ్ హాబ్స్ మాట్లాడుతూ.. బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థల్లో ఇది అత్యంత సాధారణమైన విధానాల్లో ఒకటని, దాని వెనుక ఉన్న అసలు ప్రక్రియను గుర్తించడం తమకు ఎంతో కీలకమైన విజయమని పేర్కొన్నారు.ఈ పరిశోధన కేవలం బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికే పరిమితం కాదు. CBASS వ్యవస్థకు మనుషుల్లో కనిపించే ఓ రోగనిరోధక మార్గంతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్యాక్టీరియా, మనుషుల ఉమ్మడి పరిణామ పూర్వీకుల కాలం నుంచే ఈ విధానం కొనసాగుతూ ఉండవచ్చని పరిశోధన సూచిస్తోంది.
Also Read:మాజీ సీఎం విజయన్‌కు షాక్
బ్యాక్టీరియాలోని రోగనిరోధక ప్రక్రియలను అధ్యయనం చేయడం ద్వారా ప్రాథమిక జీవశాస్త్ర అంశాలను వేగంగా అర్థం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందడం వల్ల ప్రయోగాలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చు. వాటి నుంచి లభించే సమాచారాన్ని మానవులకు దగ్గరగా ఉండే జీవ నమూనాల్లోనూ పరిశీలించవచ్చు. భవిష్యత్తులో ఈ ఆవిష్కరణ యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియాపై ఫేజ్ థెరపీని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి దోహదపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

