భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చేసినా బాహుబలి సునామి తట్టుకోవడం కష్టమే.‘బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’నిలిచింది. ఈ విషయాన్ని ఆర్కా మీడియాతో పాటు, బాహుబలి టీమ్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం యొక్క కలెక్షన్లు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న అన్ని పాత రికార్డుల్ని చెరిపేసిన ఈ సినిమా తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోల పేరిట ఉన్న పలు రికార్డుల్ని దాటేసి త్వరలో తలైవర్ రజనీకాంత్ పేరిట ఉన్న ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ ఇన్ తమిళనాడు ఘనతను కూడా సొంతం చేసుకోనుంది.
మొదటి మూడు రోజులకు రూ. 30 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొత్తం 10 రోజులకు కలిపి రూ. 80 కోట్ల పైగానే వసూలు చేసింది. ఈ లెక్కలతో తమిళనాడులో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా ఉన్న ‘వేదాళం, కబాలి, తేరి’ లను బాహుబలి అధిగమించి అన్నిటికన్నా మొదటి స్థానంలో ఉన్న రజనీకాంత్ ‘రోబో’ ను సమీపించింది. ఇంకొన్ని రోజుల్లో ఆ రికార్డును కూడా బాహుబలి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్రేక్ చేస్తుందని తమిళ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే ఈ చిత్రానికి విడుదలైన రోజు కంటే కూడా ప్రస్తుతం వస్తున్న వసూళ్లే మెరుగ్గా ఉన్నాయి.
ఇదిలాఉంటే..ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఒకెత్తైతే.. దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్‌లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు.