నైపుణ్యంతో కూడిన విద్య ముఖ్యం- వినోద్ కుమార్

328
b vinod kumar

నైపుణ్యంతో కూడిన విద్య ముఖ్యమని, అందుకు అధ్యాపకులు, ప్రొఫెసర్ లు ప్రత్యేక దృష్టిని సారించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. బంజారాహిల్స్ లోని హోటల్ హయాత్‌లో శుక్రవారం జరిగిన ఎడ్యు సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యతోనే విద్యార్థులు జీవితంలో రాణించి సమాజానికి వెన్నెముకగా మారుతారని..రొటీన్ విద్యా ధోరణిని విడనాడాలని, నూతన కోర్సులు ప్రవేశ పెట్టాలని వినోద్ కుమార్ అన్నారు.

ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కీల్స్ ను పెంచేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఐఐ, ఉన్నత విద్యా మండలి కలిసి సంయుక్తంగా కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన గురుకుల పాఠశాలలు గ్రామీణులకు వరంగా మారాయని అన్నారు. ఒక్క గత ఏడాదిలోనే 500 గురుకులాలు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్శిటీ లలో ఖాళీగా ఉన్న వివిధ 1061 పోస్టులను సీఎం కేసీఆర్ ఇటీవల భర్తీ చేస్తూ ఆదేశాలు జారీచేశారని వినోద్‌ కుమార్‌ అన్నారు.ఐ టీ రంగంలో దేశంలోనే అగ్రభాగాన ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఫార్మా రంగంలోనూ టాప్ గా నిలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లు వెంకట రమణ, లింబాద్రి, సి ఐ ఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.