కేంద్రం, రైల్వే శాఖ తీరును ఖండిస్తున్నాం: వినోద్

294
B Vinod Kumar Slams Central Government
- Advertisement -

కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేరవేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వారి పట్ల మానవత్వం, కనికరం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని వినోద్ కుమార్ అన్నారు. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు చేరవేసేందుకు 85 శాతం ప్రయాణ ఖర్చులు భరిస్తున్నట్లు కేంద్ర మంత్రులు చెప్పడంలో వాస్తవం లేదని, ఇదీ పూర్తి అబద్ధం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రైలులోని ఒక బోగీలో సాధారణంగా 72 మంది ప్రయాణీకులకు అవకాశం ఉంటుందని, కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ తో బోగీలో 54 మందికే సర్దుబాటు చేయాల్సి వస్తోందని.. మిగతా 18 సీట్లకు రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం బడాయిలు చెబుతోందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పిందే చెబుతున్నారని వినోద్ కుమార్ వివరించారు.

ఒక అబద్దాన్ని పదేపదే చెప్పడంతో అది వాస్తవం అవుతుందని కేంద్ర మంత్రులు భావిస్తున్నారని అన్నారు. బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ వంటి పలు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కరోనా భయంతో మండుటెండలో కాలి నడకన సొంత ఊర్లకు వెళుతున్న భయానక, కటిక దుర్భర పరిస్థితి చూసి బాధ పడని వారు లేరని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని సొంత రాష్ట్రాలకు చేర్చడానికి 85 శాతం ప్రయాణ రాయితీలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రులు బూటకపు మంత్రం జపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.

కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయాణ ఖర్చులు భరించాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలకు ఉందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలు ఆ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వాస్తవానికి కొవిడ్ కు ముందు ఎంత రైలు చార్జీలు ఉన్నాయో.. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంతే రైలు చార్జీలు వసూలు చేస్తోందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఉదాహరణకు ఘట్కేసర్ నుంచి జసిద్ది జంక్షన్ కు సాధారణంగా ఉన్న రూ. 675 చార్జీను ప్రస్తుత కరోనా కాలంలో కూడా వలస కార్మికుల నుంచి అంతే మొత్తాన్ని రైల్వే వసూలు చేసిందని వినోద్ కుమార్ అన్నారు. వలస కార్మికుల దుర్భర పరిస్థితిని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 కోట్లు భరించి 63 రైళ్ల ద్వారా 85, 273 మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేసిందని వినోద్ కుమార్ తెలిపారు. రైలు ప్రయాణ సబ్సిడీని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రులు చెబుతున్నారని, కానీ ఇది దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత విషయమేనని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

- Advertisement -