ఎంపీ నామాతో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ..

150
B vinod kumar
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన 4-6 లైన్ల జాతీయ రహదారులకు మోక్షం కలిగించేందుకు అనుసరించాల్సిన విధానాలపై టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావుతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చర్చించారు.గురువారం హైదరాబాద్ లోని నామాతో ఆయన నివాసంలో వినోద్ కుమార్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ రహదారులు త్వరితగతిన మంజూరు అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వినోద్ కుమార్ ఆయనకు సూచించారు.

గత 16వ లోక్ సభ సభ్యులుగా ఉన్న కాలంలో నిరంతరం ఈ జాతీయ రహదారుల అంశంపై కేంద్ర మంత్రి, అధికారులతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

కరీంనగర్-వరంగల్ మధ్య నాలుగు, ఆరు లైన్ల జాతీయ రహదారి నంబర్ 563, జగిత్యాల-కరీంనగర్, ఆర్మూర్-జగిత్యాల-రామగుండం, కరీంనగర్-గడ్చిరోలి, ఖమ్మం-దేవరపల్లె, మంచిర్యాల-వరంగల్, ఖమ్మం- విజయవాడ, వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-మన్నెగూడ, దేవసాగర్-మరికల్-జడ్చర్ల, కోదాడ-ఖమ్మం జాతీయ రహదారులు తక్షణమే మంజూరు కావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రెండు, నాలుగు లైన్ల జాతీయ రహదారులైన సగ్రోలి-బోధన్-నిజామాబాద్, హైదరాబాద్-మొయినాబాద్-చేవెళ్ల-మన్నెగూడా-కొడంగల్, నకిరేకల్-మహబూబాబాద్-నర్సంపేట-మల్లెపల్లి, హైదరాబాద్-ఆమంగల్-కల్వకుర్తి-అచంపేట, సూర్యాపేట-మోతే-ఖమ్మం-వైరా-సత్తుపల్లి-అశ్వారావుపేట, సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవపూర్-భువనగిరి-చౌటుప్పల్, మద్నూర్-బోధన్, మహబూబ్ నగర్-జడ్చర్ల, నిర్మల్-ఖానాపూర్-రాయికల్-జగిత్యాల, కోదాడ-ఖమ్మం-కురవి ల మధ్య 2,273 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గణాంక లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేవలం 126 కిలోమీటర్ల మేరకు మాత్రమే నాలుగు లైన్ల జాతీయ రహదారులు మాత్రమే వేశారని వినోద్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని చెప్పడానికి ఇదే తాజా ఉదాహరణ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ జాతీయ రహదారులు తుది మంజూరులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులను ముమ్మరం చేయాలని నామా నాగేశ్వరరావును వినోద్ కుమార్ కోరారు.

- Advertisement -