హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు- వినోద్

24
b vinod

మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దుర్మార్గపు విష పూరిత దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలోని ఏ.ఎస్. రాజు నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పబ్బంగడుపుకునేందుకు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు మత మౌఢ్యంతో చెలరేగిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు.

మతం అనేది పర్సనల్ అంశం అని, ఓట్ల కోసం బీజేపీ నాయకులు మత విశ్వాసాన్ని రెచ్చ గొడుతున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు. మతానికి, రాజకీయాలకు ముడి పెట్టడం బీజేపీ నాయకుల దుర్మార్గానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. మత రాజకీయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజమైన దేశ భక్తుడు అయితే జాతీయ సంపదను కాపాడాలని, కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్.ఐ.సీ, బీ.ఎస్.ఎన్.ఎల్. రైల్వే వంటి పలు సంస్థలను మోడీ ప్రభుత్వం తూకం వేసినట్లు అమ్మేస్తున్నదని వినోద్ కుమార్ ఆరోపించారు.

ఇదేనా మీ దేశభక్తి అని ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు. గత ఆరేళ్లుగా శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు దిగజారి, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.