న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో ముచ్చటించారు..
ఇందులో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్‌గా జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బెంగాల్‌లోనే ఉండిపోయాను. సౌత్, నార్త్ ఒకరకమైతే..బెంగాల్‌లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను.
అన్ని సెట్స్ హైద్రాబాద్‌లోనే వేశాం. ట్రైలర్‌లో చూసి ఉంటే ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఆ సెట్‌ను హైద్రాబాద్‌లోనే వేశాం. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారు.
కోల్‌కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను.
ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు.
కరోనా వల్ల చాలా రోజు సెట్స్ పనులు ఆగిపోయాయి. మధ్యలో వర్షాలు, తుఫాను వల్ల ఇబ్బంది ఏర్పడింది. కానీ మళ్లీ షూటింగ్ మొదలయ్యే సరికి సెట్స్‌ను రెడీ చేశాం.
నిర్మాత గారు నన్ను ఏనాడూ ఏ ప్రశ్న వేయలేదు. ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడగలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం.
శ్రీమంతుడు సినిమాకు అప్రెంటిస్‌గా పని చేశాను. ఆ తరువాత నాని గారి కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు మొదటిసారి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయనతో జెర్సీగా కూడా చేశాను. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్. ఆ తరువాత దసరా కూడా చేస్తున్నాను.
నిర్మాతగా త్రిష మెయిన్ లీడ్‌గా ఓ వెబ్ సిరిస్‌ను సోనీ లివ్ సంస్థకు చేస్తున్నాం. బృందా అనే ప్రొడక్షన్ టైటిల్‌తో రాబోతోన్నాం.
టెంపుల్ సెట్‌ను ఇండస్ట్రీలో చాలా మంది చూశారు. ఇంత డీటైలింగ్‌గా ఎందుకు వేశారు.. దర్శకుడు చెప్పారని ఇలా వేశారా? మీరు వేశారని డైరెక్టర్ తీస్తారా? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.
ఆర్ట్ వర్క్‌తో పాటు కెమెరా పనితనం కూడా చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఆర్ట్ వర్క్‌కు గుర్తింపు వస్తుంది. కొన్ని సార్లు రావు. జెర్సీ సినిమాకు పేరు వచ్చింది. కానీ ఆర్ట్ డైరెక్షన్‌కు పేరు రాలేదు. అందులో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియవు. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినా కూడా మా కెమెరామెన్ దాన్ని చూపిస్తారు.
నెక్ట్స్ నాని గారి దసరా సినిమా చేస్తున్నాను. రవితేజ గారితో టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాన్ని చేస్తున్నాను. సెట్స్ వర్క్ ఆల్రెడీ మొదలయ్యాయి.
నా టీం పనిదనం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. మొదటి నుంచి ఇప్పటి వరకు అదే టీంతో పని చేస్తున్నాం. ఎవ్వరూ మారలేదు.