ఇటీవల హైదారాబాద్‌లో హేమంత్ అనే యువకుడి పరువు హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చందా నగర్‌లోని హేమంత్ నివాసం వద్ద పరువు హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న హేమంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, హైకోర్టు న్యాయవాదుల జేఏసీ సభ్యులు న్యాయం కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. హేమంత్ ఇంటి నుంచి అవంతి తండ్రి దొంతిరెడ్డి లక్ష్మ రెడ్డి నివాసం వరకు ర్యాలీగా బయలుదేరారు జేఏసీ నాయకులు. వీరి ర్యాలీని చందానగర్ పోలీసులు అడ్డుకున్నారు. హేమంత్ హత్య కేసులో దోషుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగవద్దు. నాకు న్యాయం కావాలి.నిందితులకు కఠిన శిక్ష వేయాలి అని తెలిపింది.
అడ్వకేట్ జేఏసీ మాట్లాడుతూ.. ఈ పరువు హత్యను న్యాయవాదులం అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. పరువు హత్యలపై ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయాలన్నారు. అవంతి కి కూడా ప్రాణహాని ఉంది వెంటనే తనకి రక్షణ కల్పించాలి. ప్రభుత్వం తరఫున ఉన్నత అధికారులు వచ్చి బాధితురాలితో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం బలమైన చట్టాలు తీసుకో రావాలని కోరారు.