ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 137 పరుగులకే ఆలౌటై భారత్ ముందు 106 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చక్కని స్వింగ్‌తో కంగారులకు చుక్కలు చూపించారు. చురకత్తుల్లాంటి షార్ట్‌పిచ్ బంతులు విసిరి ఆసీస్‌ను బెంబేలెత్తించారు. ఫాంలో ఉన్న ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (8), రెన్షా(6)ను ఉమేశ్ యాదవ్ చక్కటి బంతులతో పెవిలియన్‌కు పంపించాడు. కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (17)ను భువనేశ్వర్ కుమార్ కళ్లు తిప్పుకోలేని రీతిలో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ తీవ్ర కష్టాల్లో పడింది.
పేస్ బౌలర్లకు తోడు రెండో సెషన్ చివర్లో స్పిన్నర్లు విజృంభించారు.హాండ్స్‌కంబ్ (18)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపించగా తర్వాత ఓవర్‌లో రవీంద్ర జడేజా… షాన్‌మార్స్ (1)ను పెవిలియన్‌కు చేర్చాడు. మాక్స్‌వెల్ (45 బ్యాటింగ్; 48 బంతుల్లో 6×4, 1×6) ఆదుకునే ప్రయత్నం చేసిన అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బీ డ్యబ్లూగా వెనుదిరిగాడు. దీంతో 53.5 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమెష్ యాదవ్,అశ్విన్,జడేజా తలో మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలిఉండటంతో భారత విజయం లాంఛనం కానుంది.
అంతకముందు 248/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 332 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌పై 32పరుగులు ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడో రోజు ఆట ఆరంభంలో ఆచితూచి ఆడిన భారత్‌పై కమిన్స్ విరుచుకుపడ్డాడు. బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్‌మెన్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు. రెండో రోజు ఆటలో 16పరుగులతో నాటౌట్‌గా నిలిచిన జడేజా సోమవారం తొలి ఆటలో టెస్టు కెరీర్‌లో ఏడో అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. జడేజా(63),సాహా 31 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత భువనేశ్వర్, కుల్‌దీప్ యాదవ్ పెవిలియన్‌కు క్యూకట్టడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.ఆసీస్ బౌలర్లలో లైయన్ 5, కమిన్స్ 3, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.