కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఆఫీస్‌పై గురువారం ఉదయం భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు, మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని TMC జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ దాడిని దారుణమైనది, ఆమోదయోగ్యం కానిది అని పేర్కొన్నారు.
X వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసిన అభిషేక్… డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు “ఆయుధాలతో” వచ్చి కామాక్ స్ట్రీట్‌లోని TMC ఆఫీస్‌పై దాడి చేశారని తెలిపారు. TMC కార్యకర్తలపై దాడి చేసి, వారి ఫోన్లను లాక్కున్నారని, ఆఫీస్ అంతటినీ ధ్వంసం చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను పాడుచేశారని ఆరోపించారు.కోల్‌కతా పోలీసులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ తరఫున పలుమార్లు ఫోన్ కాల్స్, ఈమెయిళ్లు పంపినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఈ హింసను ఎవరు ప్లాన్ చేశారు, నిర్వహించారు మరియు నిర్దేశించారు అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదో కూడా విచారించాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ లేదా సాయుధ గుండాల ముఠా చట్టానికి అతీతం కాదు అని అన్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయుధాలతో ఒక రాజకీయ పార్టీ ఆఫీస్‌లోకి చొరబడి ప్రజలపై దాడి చేసి, ఆస్తిని ధ్వంసం చేస్తుంటే పోలీసులు స్పందించకపోతే, పశ్చిమ బెంగాల్‌లో చట్టపాలన ఎక్కడ ఉంది?..ఇక చాలు. నిందితులను అరెస్ట్ చేయండి. బాధ్యులను తేల్చండి. వెంటనే చర్యలు తీసుకోండి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read:బోడ కాకరకాయ..ప్రయోజనాలు!

