ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూస్తాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్ ఫోన్‌లో మెసేజ్ వచ్చింది. మరో వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి బయటకు వస్తూ ఏటీఎం కార్డుతో మెడ మీద గోక్కున్నాడు. అంతే.. ‘మీరు మీ ఏటీఎం కార్డును ఐదుకన్నా ఎక్కువ సార్లు గీకారు. అందుకు రూ.25 సర్వీసు చార్జీ..’ అంటూ మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నిజం కాదు. బ్యాంకులు ఖాతాదారుల నుంచి బ్యాంకులు నానా రకాలుగా వసూలు చేస్తున్న చార్జీలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జోకులు.
డబ్బులు డిపాజిట్ చేసినా చార్జీ, విత్ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకంటే భయపడే పరిస్థితి వచ్చింది సామాన్యుడికి. అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలంటూ ప్రకటన జారీ చేసిన ఎస్బీఐ.. జనాలకు మంట పుట్టించే మరో నిర్ణయం తీసుకుంది. సగటు వేతన జీవులు తమ అకౌంట్లో అంత డబ్బు ఉంచలేమంటూ లబోదిబోమంటున్నారు. ఎస్బీఐలో అకౌంట్ మెయింటెయిన్ చేయడం తమ వల్ల కాదంటూ.. దాన్ని రద్దు చేసుకునే పక్షంలో సేవింగ్స్ ఖాతా అయితే, రూ. 575, కరెంట్ ఖాతా అయితే రూ. 1000 జరిమానా విధిస్తోంది. దీంతో ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావాల్సిన పరిస్థితి. ఈ మొత్తాలను నిర్వహించలేమని, తమకు ఖాతాలు వద్దని చెబుతూ, రద్దు చేసుకునేందుకు వెళ్లిన కస్టమర్లపై ఇప్పుడు బాదుడు షురూ చేసిన బ్యాంకు వైఖరిపై ఇప్పుడు మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక నుంచి ఎస్‌బీఐలో నెలలో మూడుసార్లు మించి బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ వేస్తే సర్వీస్ ట్యాక్స్‌తో కలిసి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు మించి, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్లకు మించి నగదు తీసుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీల విధిస్తున్నాయి. అలాగే బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోయినా..రోజుల లెక్కన రూ.200 ఆపై సర్‌చార్జీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోల్లో రూ. 5 వేలు, నగరాల్లో రూ. 3 వేలు, పట్టణాల్లో రూ. 2 వేలు, గ్రామాల్లో కనీసం రూ. 1000 ఖాతాలో ఉంచాల్సిందేనని బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ట్రెండవుతున్న జోకులు….
()బ్యాంకు ముందు ఇలా రాసి ఉంది: ‘‘దొంగలకు విజ్ఞప్తి. ఇప్పటికే ఈ బ్యాంకులో నాలుగు సార్లు దొంగతనం జరిగింది. ఐదో సారి దొంగతనం చేసేవారికి ఛార్జీలు వర్తిస్తాయ్’’
()ప్రియుడితో ప్రియరాలు: ప్రియా ఇప్పటికే నీకు నాలుగు సార్లు ముద్దిచ్చా. ఇకపై ముద్దు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా రూ.20 చొప్పున చెల్లించాలి. అలాగని పూర్తిగా ముద్దులివ్వడం మానేసినా జరిమానా తప్పదు.
()కొడుకు: నాన్న పాకెట్ మనీ ఇవ్వు.
నాన్న: ఇప్పటికే నాలుగుసార్లు ఇచ్చాను. మరోసారి అడిగితే.. రూ.20 కట్ చేసి ఇస్తా.
()ఓ బ్యాంకు ఉద్యోగి రొమాంటిక్ మూడ్‌తో తన భార్యను తాకాడు.
వెంటనే ఆమె… ‘‘నువ్వు ఇప్పటికే నాలుగు సార్లు టచ్ చేశావ్. మళ్లీ టచ్ చేస్తే రూ.150 సర్వీస్ ఛార్జిగా చెల్లించాలి’’ అంది.
భర్త షాక్.. భార్య రాక్స్!
()తల్లి కూతురితో: పెళ్లై రెండేళ్లు అవుతోంది. ఇప్పటికైనా మనవడినో మనవరాలినో ఇస్తారా?
కూతురు: ఆయనవన్నీ బ్యాంకు బుద్దులే అమ్మా. మొన్నటి వరకు ఆర్థిక మాంద్యం కష్టం అన్నారు. నిన్న కొత్త నోట్లు వచ్చాక చూద్దాం అన్నారు. ఇప్పుడు… ఏదైనా నాలుగు సార్లే. ఐదో సారి ఛార్జీలు వర్తిస్తాయ్ అంటున్నారు.
()భార్య భర్తతో: ఈ రోజు నాలుగు సార్లు మీకు కాఫీ ఇచ్చా. ఐదోసారి డబ్బులిచ్చి తాగండి.