డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రజలను క్యాష్ లెస్ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే 0.5-2 శాతంతో సర్ చార్జి విధించాలని భావిస్తోంది. ఈ నెల 30 తర్వాత నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌డ్రా చేసుకుంటే సర్‌ఛార్జి విధించే అవకాశం ఉంది. ‘నిర్వహణ వ్యయం’ పేరుతో దీన్ని వసూలు చేయనున్నారని తెలిసింది.
‘డిసెంబరు 30 తరువాత ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500, బ్యాంకు నుంచి వారానికి రూ.24,000 తీసుకోవచ్చన్న నిబంధన ముగుస్తుంది. ప్రజలు గతంలో మాదిరిగానే నగదు ద్వారా లావాదేవీలు జరపడానికి ఉత్సాహం చూపుతారు. అయితే బ్యాంకుల వద్ద తగినంతగా నగదు నిల్వలు లేవు. ఫిబ్రవరి చివరినాటికిగానీ రిజర్వు బ్యాంకు అవసరమైన నగదును పంపించలేదు.అందువల్ల నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్ ఎం.బి.షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటయిన సర్‌ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారు. ఈ నిబంధనను 4-6 నెలలపాటు అమలు చేయాలని ప్రస్తుతానికి భావిస్తున్నప్పటికీ, ఇది శాశ్వతంగా ఉండే అవకాశం ఉంద’ని ఆ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఐఎంపీఎస్, యూపీఐ చెల్లింపులపై చార్జీలను నియంత్రించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. వెయ్యి రూపాయలకు మించిన మొత్తాలకు నెఫ్ట్ మాదిరిగానే వర్తింపజేయాలని సూచించింది. ఆర్బీఐ నియమాల ప్రకారం.. రూ.10వేల లోపు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) లావాదేవీలకు రూ.2.50 మాత్రమే చార్జీగా వసూలు చేస్తారు. ఆపై లక్ష వరకు రూ.5, రెండు లక్షల వరకైతే రూ.15, ఆపై మొత్తాలకు రూ.25 తీసుకుంటారు. దీనికి అదనంగా సర్వీసు చార్జి వసూలు చేయనున్నారు.