శ్రీదేవి రాకతో స్వర్గంలో..!

468
Athiloka Sundari in heavens
- Advertisement -

తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న వెండితెర జాబిలమ్మ శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారతాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. మిస్టరీగా మారిన శ్రీదేవి డెత్‌ కేసులో గంటగంటకు రకరకాల ట్విస్ట్‌లు వెలుగుచూస్తుండగా సినీ ప్రపంచం ఆమె మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్లిపోయిన ఆమె జ్ఞాపకాలను మరచిపోలేక పోతున్నారు ఫ్యాన్స్‌.

అయితే,ఇదంతా భూలోకంలోనేనట. అతిలోకసుందరి రాకతో స్వర్గంలో పండగ వాతావరణం నెలకొందట. ఫన్నీగా ఇప్పుడు శ్రీదేవికి సంబంధించిన న్యూస్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. స్వర్గం అనగానే మనకు గుర్తొచ్చేది రంభ,ఊర్వశి,మేనక. అందానికి అప్సరసలాంటి వీరు..ఇప్పుడు శ్రీదేవి రాకతో అసూయతో కుల్లుకుంటున్నారట. అదేదో సినిమాలో క‌వి వ‌ర్ణించిన‌ట్లు నిజంగానే పూల రెక్క‌లు.. కొన్ని తేనె చుక్క‌లు క‌లిపి బ్ర‌హ్మ‌దేవుడు రూపొందించాడేమో అన్న‌ట్లుగా ఉండే శ్రీదేవి అందం,అభినయాన్ని చూసి కళ్లు తిప్పుకోలేక పోతున్నారట.

ఇక వీరి సంగతి అలా ఉంచితే శ్రీదేవిని చూసి మాత్రం ఎన్టీఆర్, ఏయన్ఆర్, శోభన్ బాబు పండగ చేసుకుంటున్నారట. బాలనటిగా తెలుగులో బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ మనుమరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత కాలంలో అదే ఎన్టీఆర్ సరసన 16 ఏళ్ల వయసులో వేటగాడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్ చిత్రాల్లో శ్రీదేవి నటించింది. ఈ నేపథ్యంలో మరోసారి శ్రీదేవితో సినిమా చేసేందుకు సిద్దమైన ఎన్టీఆర్ ఈ బాధ్యతను బాపు భుజాలమీద వేశాడట.

ఎన్టీఆర్‌తో పాటూ ఏఎన్నార్,శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఏఎన్నార్‌-శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ప్రేమాభిషేకం,శోభన్ బాబు-శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన దేవత సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాల్లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో వీరు సైతం మరోసారి అందాల సుందరితో మూవీకి తహతహలాడుతున్నారట.

శ్రీదేవితో ప్రేమాభిషేకం సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన దాసరి మరోసారి ఈ సినిమాకు రిమేక్ తీసే పనిలో బిజీగా ఉండగా హీరోగా నటించేందుకు అక్కినేని నాగేశ్వరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వైవిధ్యానికి పెద్దపీట వేయడంలో దిగ్దర్శకుడు కె.బాలచందర్ బాణీయే వేరు… పాతకథనైనా కొత్త పంథాలో చెప్పగల నేర్పు ఆయన సొంతం. బాలచందర్-శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన వసంత కోకిల సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ వసంతకోకిల కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట బాల చందర్.

శ్రీదేవి-శోభన్ బాబు ఆల్ టైమ్ హిట్ సాంగ్ వెల్లువొచ్చి గోదారమ్మ పాట అందరికీ గుర్తుండే ఉంటుండి. ఈ పాట ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ పాటకు రిమేక్ తీసేందుకు యుముడ్ని బిందెలు అడిగేందుకు శోభన్ బాబు సిద్దమవుతుండగా పాట చెడగొడదామని రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ పాట కోసం ఎన్ని డబ్బులైన పెట్టేందుకు నేనున్నా అంటూ ముందుకొస్తున్నాడట డి రామానాయుడు.

కొంతకాలం క్రితమే తమిళనాడును శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయిన అమ్మ జయలలిత తనకు తోడు దొరికిందని సంతోష పడుతుందట. ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఇంద్రజగా అలరించిన శ్రీదేవి ఆ సినిమాలో ఉంగరం పారేసుకుని భూలోకానికి రావడం,ఇక్కడే ఉండిపోవడం జరగగా మరోసారి మళ్ళీ ఉంగరం పాడేసుకుని భూలోకానికి వెళుతుందేమోనని శ్రీదేవి నుంచి ఉంగరాన్ని తీసుకున్నాడట ఇంద్రుడు. మొత్తానికి కామెడీగా శ్రీదేవి గొప్పతనాన్ని రాసిన ఈ స్క్రిప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భూలోకంలోనే కాదు యమలోకంలో కూడా ఆమె నెంబర్ వన్‌ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -