స్టెప్పులతో అదరగొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే….!

381
athram sakku
- Advertisement -

ఎమ్మెల్యే అనే హోదా లేకుండా నిరాడంబరంగా ఉంటూ, హంగూ అర్భాటాలు లేకుండా ప్రజలతో మమేకం అయ్యే నేతల్లో అసిఫాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముందు వరుసలో ఉంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఆత్రం సక్కులో అధికార దర్పం ఏ మాత్రం కనిపించదు. చుట్టూ మందీ మార్బలం, అనుచరులు ఉండరు. పెద్ద పెద్ద కాన్వాయ్‌లు ఉండవు..సింపుల్‌గా సాధారణ వ్యక్తి వలె వ్యవహరిస్తారు. ఇటీవల హైదరాబాద్ నుంచి అసిఫాబాద్ వెళుతూ రోడ్డు సైడ్ టిఫిన్ బండి దగ్గర సాధారణ వ్యక్తిలా ఓ స్టూల్‌పై కూర్చుని టిఫిన్ చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

అసిఫాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు చాలా చోట్ల సాధారణ హోటల్‌లో భోజనం చేస్తారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారు వండుకున్న భోజనాన్నే తినేవారని అసిఫాబాద్ ప్రజలు చెబుతుంటారు. తాజాగా ఆదివాసీలతో కలిసిపోయి ఆత్రం సక్కు సంప్రదాయ థింసా డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివాసీ తెగకు చెందిన రాజ్‌గోండ్స్‌ వివాహ వేడుకల్లో అసిఫాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకల్లో ఎమ్మెల్యే స్వయంగా తోటి ఆదివాసీలతో కలిసి థింసా డాన్స్ వేసి అందరిలో జోష్ నింపారు.

అంతే కాదు ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూ అలరించారు. కొమురం భీం జిల్లా సిర్పూర్ మండలం దేవుడుపల్లి గ్రామంలో సోమవారం ఆత్రం ధర్మరావు-మహేశ్వరీ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆత్ర౦ సక్కు సాధారణ వ్యక్తిలా అందరితో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. తమ ఆచార సాంప్రదాయాలను ఎమ్మెల్యే గౌరవిస్తారని, ఆయన మాతో కలిసి నృత్యం చేయడం పట్ల ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినా తమ మూలాలను మర్చిపోకుండా తమ సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా స్టెప్పులేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుపై ఆదివాసీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -