అశ్విన్‌ స్పిన్‌కు కివీస్‌ విల… విల..

213
- Advertisement -

మూడో టెస్టులో టీమిండియా కివీస్‌పై 321 పరుగుల తేడాతో విజయం సాధించింది. 475 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు 153 పరుగులకే అలౌట్ అయింది. ఆట ఇంకా ఒకరోజు మిగిలి ఉండగానే టీమిండియా విజయం దక్కించుకుంది. దీంతో 3-0తో క్లీన్‌ స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో కివీస్‌ను కుప్పకూల్సిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పర్యాటక జట్టును ఏడు వికెట్లతో బెంబేలెత్తించాడు. కీలక ఆటగాళ్లు విలియమ్స్‌సన్‌(27), టేలర్‌(32), రోంచి(15)లను అశ్విన్‌పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్‌ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టేలర్‌ చేసిన 32 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

ఇండోర్‌ టెస్టులో భారత్‌ తొలిరోజు నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కోహ్లి(211), అజింక్య రహానే(188) భారీస్కోరు సాధించి పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 365 పరుగుల రికార్డుస్థాయి భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 557/5 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 299 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్‌ అశ్విన్‌(6/81), రవీంద్ర జడేజా(2/80) కివీస్‌ను కుప్పకూల్చారు. దీంతో భారత్‌ 258 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం పర్యాటక జట్టుకు ఫాలోఆన్‌ ఇవ్వకుండా తిరిగి బ్యాటింగ్‌ చేపట్టింది. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌(50), ఛతేశ్వర పూజారా(101 నాటౌట్‌) రాణించడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 216/3 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసి.. కివీస్‌కు 475 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

475 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 153 పరుగులకు ఆలౌటై… ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది. ఈ సిరీస్‌లో బ్యాట్‌, బంతితోనూ రాణించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్నాడు.

- Advertisement -