రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది టీకాంగ్రెస్. డీసీసీల నుండి ప్రతిపాదనలు,అంతర్గత సర్వేలు నిర్వహించిన పీసీసీ నేతలు అంగబలం,అర్దబలం ఉన్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 17 ఎంపీ స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఫైనల్ లిస్టును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
కీలకమైన హైదరాబాద్ నుండి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై బలమైన అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును పరిశీలిస్తోంది. అయితే అజార్ మాత్రం సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగుతారని కొంతకాలం క్రితం ప్రకటించారు. పీసీసీ నేతలు మాత్రం ఓవైసీకి పోటీగా అజార్ అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. ఒకవేళ అజార్ ససేమిరా అన్నపక్షంలో శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని భావిస్తోంది.
2009 ఎన్నికల్లో యూపీలోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు అజార్. 2014 ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంక్ సవాయ్ మాధోపూర్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణ నుండి పోటీచేసేందుకు ఆసక్తికనబరుస్తున్న అజార్ విజయతీరాలకు చేరుతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.