ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పెట్టుకున్న తలపాగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ హిందూ అతివాద గ్రూపులపై విరుచుపడే ఈ నేత… ఏకంగా కాషాయ తలపాగా ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ‘నా ప్రాణం ఉన్నంత వరకు భారత్ మాతాకి జై’ అని అనను అన్న ఈ ఎంఐఎం నేత నేడు ఏకంగా కాషాయ తలపాగా ధరించడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఓవైసీ బెల్గాంలోని భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాషాయ రంగు గల తలపాగాను ధరించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే తాను జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నానన్నారు.
అయితే ఈ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం విశేషం. మరోవైపు ఓవైసీ కాషాయ తలపాగా ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలో హిందువులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసమే ఈ తరహా ట్రిక్కులు ప్లే చేస్తున్నారని, ఇది ఒక రాజకీయ నాటకం అంటూ, ఇది బీజేపీకి పెద్ద షాక్ అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.