బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి ‘అర్నబ్’ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు తీవ్ర వర్ష సూచన జారీ అయ్యింది. నేడు (సెప్టెంబర్ 23), రేపు (సెప్టెంబర్ 24) రెండు రాష్ట్రాల్లోనూ అత్యంత భారీ నుంచి తీవ్ర అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.
తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో 17 జిల్లాలకు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.పలు ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెదపల్లి, సిరిసిల్ల తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తీవ్రంగా అప్రమత్తం చేశారు.హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు.
నీటిపారుదల, జిహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ (SDRF/NDRF) బృందాలు సిద్ధంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతంపై తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది.కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read:చాలా డిఫరెంట్‌గా ‘ది ప్యారడైజ్’
తుఫాను ప్రభావం వల్ల ఈనెల 25, 26 తేదీల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడతాయని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. తీరం వెంట గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖలు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, పొంగిపొర్లుతున్న వాగులు మరియు వంకల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించాయి.

