జమ్ము విమానాశ్రయంలోని భారత వాయుసేన వైమానిక స్థావరంపై ఆదివారం తెల్లవారు జామున రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల(ఐఈడీ)ను జారవిడవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దానివల్ల స్వల్పంగా నష్టం జరిగినప్పటికీ, భారత సైనిక స్థావరంపై తొలిసారి డ్రోన్లతో దాడి జరగడం భవిష్యత్తులో డ్రోన్లతో భారీ దాడులు జరిగే అవకాశం ఉందనడానికి సూచికగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ దాడిని మరవకముందే జమ్ములోని రాత్నుచక్-కాలుచక్ మిలిటరీ ఏరియా వద్ద ఈ రోజు తెల్లవారు జామున మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. మరోసారి డ్రోన్ల ద్వారా బాంబు దాడి ప్రయత్నం చేశారు దుండగులు.
వెంటనే భారత బలగాలు అప్రమత్తమైయ్యాయి, క్విక్ రియాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగింది. భారత భద్రతా బలగాలు డ్రోన్లపై కాల్పులు జరిపాయి. దాంతో వెంటనే డ్రోన్లను వెనక్కు మళ్లించారు దుండగులు. భారీ ముప్పును నివారించినట్టు రక్షణశాఖ వెల్లడించింది. అయితే ఆ డ్రోను తిరిగిన ప్రాంతంలో ఏవైనా పేలుడు పదార్థాలను జార విడిచిందా? అన్న విషయాన్ని తేల్చేందుకు భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని అధికారులు చెప్పారు. ఆ ప్రాంతంలో హైఅలెర్ట్ ప్రకటించినట్లు వివరించారు.