సీఎం జగన్‌ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు..

95
- Advertisement -

పీఆర్సీ అంశంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మండిపడ్డారు. శనివారం ఆయన విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నిర్ణయాలు ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రమే నచ్చాయన్నారు. 20 శాతం ఫిట్‌మెంట్ తగ్గితే ఉద్యోగులు ఎలా సమర్ధిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం హెచ్ఆర్ఏపై స్పష్టత ఇవ్వలేదన్నారు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. స్వచ్చంద ఓటీస్ పేరుతో ప్రజలను భయపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఆపేస్తామని వాలంటీర్లతో బెదిరిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బయటకు వచ్చి వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో వైసీపీ మంత్రులున్నారని శైలజనాథ్ వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ రెడ్డి పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని విమర్శించారు. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచటం ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని, రాజధాని అమరావతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తో పాటు విలేకరుల సమావేశంలో ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గురునాధం, ఉపాధ్యక్షులు మార్టిన్, నగర అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహారావు, ఏపీసీసీ హ్యుమన్ రైట్స్ సెల్ చైర్మన్ రాజశేఖర్, ఆర్టీఐ సెల్ చైర్మన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -