నీట్-యుజి (NEET-UG) పరీక్షల పేపర్ లీకేజీలు మరియు ఇతర అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో భారత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక అడుగు వేసింది. లోక్‌సభలో పిఎమ్‌ఓ (PMO) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ను ప్రవేశపెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, విచారణను వేగవంతం చేయడానికి మరియు బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
2024 చట్టంతో పోలిస్తే ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా అనేక పటిష్టమైన మార్పులను ప్రభుత్వం తీర్మానించింది. పాత చట్టంలో దోషులకు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉండగా, కొత్త బిల్లులో దానిని గరిష్టంగా 10 సంవత్సరాలకు పెంచారు. అలాగే, విధించే జరిమానాను రూ. 10 లక్షల నుండి ఏకంగా రూ. 10 కోట్లకు హెచ్చించారు. సాధారణ విచారణల స్థానంలో పరీక్షల అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ను ఏర్పాటు చేయడంతో పాటు, కేవలం 2 నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలనే నిబంధనను ప్రతిపాదించారు. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నెలకొల్పి, రోజువారీ విచారణ ద్వారా 3 నెలల్లోగా తీర్పులు వెలువరించేలా కాలపరిమితి విధించారు. అలాగే, హైకోర్టులో అప్పీలు చేసుకునే గడువును 30 రోజులకు, ఆ అప్పీలుపై హైకోర్టు తీర్పు ఇచ్చే సమయాన్ని 3 నెలలకు పరిమితం చేశారు.
పరీక్షా విధానంలో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా విద్యార్థులతో వీడియో సందేశాల ద్వారా సంభాషిస్తూ, ఐటీ దిగ్గజం నందన్ నీలేకణి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక అత్యున్నత స్థాయి (హై-పవర్డ్) టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటూ, ఎన్‌టీఏ (NTA) నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వీకరించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్‌టీఏకు చెందిన 47 మంది అధికారులను తొలగించడమే కాకుండా, దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఢిల్లీ పోలీసు విభాగంలో ప్రత్యేక ఎస్‌టీఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
Also Read:వీడియో.. టీచర్ ‘సెల్ఫ్ అటెండెన్స్ బోర్డ్’!

