అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేషాన్ని, శ్వేతజాతి ఆధిపత్య భావజాలాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, భారతీయ అమెరికన్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అరోరాలో ఉన్న హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతీయులపై విద్వేషం, శ్వేతజాతి ఆధిపత్య భావజాలం తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయే వరకు వేచి చూడకుండా ఇలాంటి బెదిరింపులను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించిన నిందితుడి సహోద్యోగులకు, సకాలంలో స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా జీవించే, తమ మతాన్ని ఆచరించే హక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు.
చికాగో ప్రాంతంలోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆన్లైన్లో భారతీయ వ్యతిరేక విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయశాఖ మరింత నిఘా పెట్టాలని ఇండియన్ అమెరికన్ అడ్వకసీ కౌన్సిల్ కోరింది. ఆన్లైన్లో వ్యాపించే విద్వేషం వాస్తవ ప్రపంచంలో హింసకు, ఉగ్రవాద చర్యలకు దారితీయవచ్చని హెచ్చరించింది.
Also Read:MGR బయోపిక్‌లో త్రిష?
హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడి నివాసంలో తుపాకీ, వందలాది బుల్లెట్లు, రక్షణ కవచం, శ్వేతజాతి ఆధిపత్య భావజాలాన్ని ప్రతిబింబించే పత్రాలు లభించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారని తెలిపింది. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా బెదిరింపులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించింది.
పాలటైన్ పోలీసుల వివరాల ప్రకారం.. అలెగ్జాండ్రోస్ పపొరాకిస్ అనే 19 ఏళ్ల యువకుడు హిందూ ఆలయంపై కాల్పులకు పాల్పడేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 11న సామూహిక కాల్పుల ముప్పు గురించి పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభమైంది. నిందితుడు తుపాకీ, మ్యాగజైన్లు, బుల్లెట్లు, రక్షణ పరికరాలకు సంబంధించిన ఫొటోలు, దాడి ప్రణాళిక ఉన్న పత్రాన్ని ఇతరులతో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు.

