టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 2026లో తన 69వ సిక్సర్ కొట్టి, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును అధిగమించాడు. సూర్యకుమార్ 2022లో 68 సిక్సర్లు బాదగా.. అభిషేక్ ఆ ఘనతను దాటేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. చివరి మ్యాచ్ బెంగళూరులో జరగనుంది.
వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మకు పవర్‌ప్లేలో స్వేచ్ఛగా ఆడే అవకాశం పెద్దగా లభించలేదు. ఆరంభంలో సంజు శాంసన్ పరుగుల వేగాన్ని నియంత్రించగా, పవర్‌ప్లే తర్వాత విండీస్ బౌలర్లు అభిషేక్‌ను కట్టడి చేశారు. చివరకు షమర్ స్ప్రింగర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడిన అభిషేక్ బంతిని బౌండరీ దాటించాడు. దీంతో 2026లో తన 69వ సిక్సర్‌ను నమోదు చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు.
ఈ ఏడాది అభిషేక్ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై 35 బంతుల్లో 84 పరుగులు చేసి ఎనిమిది సిక్సర్లు బాదాడు. గువాహటిలో 20 బంతుల్లోనే అజేయంగా 68 పరుగులు సాధించి ఐదు సిక్సర్లు కొట్టాడు. అయితే తొలి ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఐదుసార్లు సున్నాకే ఔటవడంతో కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు సిక్సర్ల రికార్డుతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ 50 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ సిరీస్‌లో అతడికిది రెండో సెంచరీ కాగా, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడోది. పర్యటనలో నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 223 పరుగులకే ఆలౌటైంది.
Also Read:MGR బయోపిక్‌లో త్రిష?

