పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సువేందు అధికారి తన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. వచ్చే నెల (జూన్) నుండి మహిళలకు ఆర్థిక సాయం అందించే ‘అన్నపూర్ణ భండార్’ పథకాన్ని ప్రారంభించాలని, అలాగే ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఈ పథకం కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు నెలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందిస్తారు.ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు మరియు అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై సచివాలయం (నబన్నా)లో ఉన్నతాధికారులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని జూన్ నుండి అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను కూడా జూన్ నుండి రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయబోమని, అన్ని పథకాలు కొనసాగుతాయని సువేందు అధికారి స్పష్టం చేశారు.ఇసుక, బొగ్గు అక్రమ తవ్వకాలు మరియు పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ‘సిండికేట్ రాజ్’ (దందా)ను అంతం చేయాలని పోలీసులకు సూచించారు. ముఖ్యంగా బీర్భూమ్ జిల్లాలో నిరంతర నిఘా ఉంచాలని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నకిలీ జాబ్ కార్డుల ద్వారా నిధులు కాజేసిన వారిని గుర్తించి, లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించాలని అధికారులను ఆదేశించారు.రాజకీయ కక్షసాధింపులు లేకుండా పాలన సాగాలని, అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించాలని సువేందు అధికారి అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
Also Read:‘గాంధీ బజార్’లో బాబిల్ ఖాన్

