బీజేపీకి అన్నామలై రాజీనామా

2
- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని భారీ పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ తమిళనాడు బీజేపీ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు పంపిచారు.

జాతీయ నాయకత్వానికి పంపిన 5 పేజీల రాజీనామా లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే తాను కష్టపడి సంపాదించుకున్న ప్రతిష్టాత్మక ఐపీఎస్ (IPS) పదవిని వదులుకుని 2019లో బీజేపీలో చేరిన పరిస్థితులను ఆయన గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోవడానికి, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న పరాజయాలకు గల అంతర్గత కారణాలను ఆయన లేఖలో సుదీర్ఘంగా వివరించారు. స్థానిక లీడర్‌షిప్, పొత్తుల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొన్నారు.

డీఎంకే అవినీతిపై తాను క్షేత్రస్థాయిలో ఎంత పోరాటం చేసినా.. చివరకు అన్నాడీఎంకే (ADMK) తో రాజీ పడే ధోరణిలో పార్టీ వ్యవహరించడం…తనను మరియు తన మద్దతుదారులను పక్కన పెట్టడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్నామలై ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజా సేవ పార్టీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారని తన మద్దతుదారులతో జూన్ 4న కీలక భేటీ నిర్వహించి అధికారికంగా తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

- Advertisement -