అవినీతిపై మరోసారి సమరానికి దిగారు సామాజిక కార్యకర్త అన్న హజారే. ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో వేలాదిమంది అనుచరులతో కలిసి ఆమరణదీక్షకు దిగారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్‌పై విరుచుకపడ్డారు. రాజకీయ నాయకులు అందరు మోసగాళ్లేనని మండిపడ్డారు. దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
తన చివరి శ్వాస ఉన్నంత వరకు అవినీతిపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసిన ఆయన తన దీక్షకు నిరసనకారులు రాకుండా అడ్డుకునేందుకు రైళ్లు రద్దుచేసిన కేంద్రప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అన్నాహజారే దీక్ష నేపథ్యంలో రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
లోక్‌పాల్ చట్టం కోసం 2011లో హజారే నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2011 ఏప్రిల్ 5న నిరశన దీక్షకు దిగారు. ఆయన ఉద్యమానికి మేధా పాట్కర్, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ, జయప్రకాశ్ నారాయణ తదితరులు మద్దతు పలికారు. ఆయన ఉద్యమంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్ చట్టాన్ని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.