సర్పంచ్ బరిలో అనంత శ్రీరామ్ తల్లి

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తన తల్లి ఉమారాణికి అవకాశం కల్పించాలని అనంత శ్రీరామ్ జనసేన పార్టీ నాయకులను కోరారు.

ఇటీవలే అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు ఉమారాణి, వీరేవేంకట సత్యనారాయణ మూర్తి జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తన తల్లిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆయన స్థానిక జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు నాయకులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు తన తల్లి ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామ అభివృద్ధి కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తానని అనంత శ్రీరామ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.20 లక్షలు అందిస్తానని…మిగిలిన రూ.20 లక్షలను విడతల వారీగా గ్రామాభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Also Read:రాజీనామా చేస్తే..తప్పు చేసినట్లు కాదు!

సినీ గేయ రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అనంత శ్రీరామ్ కుటుంబం గ్రామ రాజకీయాల్లోకి రావడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

- Advertisement -