గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో యువ క్రికెటర్లు సిరాజ్, సుందర్ వంటి కొత్త ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా భారత జట్టులోని ఆరుగురు యువ క్రికెటర్లకు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో తమ టెస్టు కెరీర్ ప్రారంభించిన మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మాన్ గిల్, నటరాజన్, నవదీప్ సైనీలకు మహీంద్రా థార్ ఎస్ యూవీ కార్లలను బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన ద్వారా భవిష్యత్తుపై ఆశలు కల్పించారని కొనియాడారు.
ఆస్ట్రేలియా టూర్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్ షురూ చేసిన వీరికి సరికొత్త మోడల్ థార్ వాహనాలను బహూకరిస్తుండడం వ్యక్తిగతంగా ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. వీటికి అయ్యే తానే భరిస్తున్నానని, కంపెనీకి ఈ వాహనాల ఖర్చుతో సంబంధం లేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. యువత తమను తాము నమ్మేలా ప్రేరణ కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే ఈ కానుకలు అందజేస్తున్నానని ఆయన తెలిపారు.