జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల నియమాలు..

44
ghmc

రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తూ.. ఈ ఎన్నికల సందర్భంగా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదర్శ ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సిందిగా కోరింది. పరోక్ష ఎన్నికల సందర్భంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను మభ్యపెట్టే చట్టవ్యతిరేక చర్యలైన.. లంచమివ్వడం, ప్రలోభపెట్టడం, ప్రభావితం చేయడం వంటి వాటిని అదుపులో పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ఆదర్శ ప్రవర్తనా నియమావళి విధించింది.ఈ ప్రవర్తనా నియమావళి పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుండి పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టం, భారత శిక్షాస్మృతి (IPC)లో నిర్వచించిన విధంగా లంచం ఇవ్వడాన్ని ఏవైనా రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న ఎవరైనా ఎన్నికైన సభ్యులు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవలంబించరాదు మరియు ప్రోత్సహించరాదు. పరోక్ష ఎన్నికల సందర్భంగా, ఎన్నికైన ప్రతినిధులు సంబంధిత రాజకీయ పార్టీలు జారీచేసిన విప్ లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా వారిని ప్రభావితం చేయడాన్ని నిషేధించడం జరిగింది. రాజకీయ పార్టీలు గాని లేదా వాటి అభ్యర్ధులలో ఎవరైనా గానీ పరోక్ష ఎన్నికలలో ఓటర్లు వారి ఓటు హక్కులను వినియోగించే సందర్భంలో వారిని అక్రమ ప్రభావానికి గురిచేయడానికి ప్రయత్నించరాదు.

ఏదేని రాజకీయ పార్టీ, ఎవరేని పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్‌ను ధిక్కరించేందుకు గాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపరాదు. అధికారంలో ఉన్న పార్టీ లేదా ఎవరేని ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసెన్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్’లో ఉన్న కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టులను పునరుద్ధరించడం మొదలగునవి మంజూరు చేసేటప్పుడు ప్రోత్సాహకాలు లేదా నిరుత్సాహకాలను అందించుట కోసం వారి అధికారాన్ని బహిరంగంగా లేదా రహస్యంగా దుర్వినియోగం చేయడం, దుర్వినియోగానికి ప్రయత్నించడం గానీ చేయరాదు. అదే విధంగా విచారణ సంస్థలు నేరాలను నమోదు చేయడం లేదా ఛార్జిషీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు మొదలగు వాటి అమలులో ఎలాంటి పక్షపాతానికి పాల్పడరాదు.

ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికయిన ప్రతినిధులతో ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని ఎలాంటి క్యాంపులు (శిబిరాలు) నిర్వహించరాదు.జిహెచ్ఎంసి పరోక్ష ఎన్నికల నిర్వహణ కొరకు నిర్ధారించిన ప్రారంభ సమయానికి 48 గంటల ముందు నుండి అట్టి పరోక్ష ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టడం చేయరాదు. ఇట్టి నిషేధము సంబంధిత పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఆదర్శ ప్రవర్తనా నియమావళిలోని పై నిబంధనల పట్ల ఎలాంటి ఉల్లంఘన జరిగినా సంబంధిత చట్టాలు/నియమావళిలలోని సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలకు గురి కావాల్సి వస్తుంది. మిగతా సందర్భాలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 లోని సెక్షన్ 612లను తగిన సందర్భాలలో అనుసరించాలి.