విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై నిర్మితమైన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె.సతీష్ కుమార్ సమర్పణలో ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రానికి నిర్మాత.
ఇటీవలే చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొంది, చూడ చక్కని చిత్రంగా, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకొంది.
ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..’ సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆతరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కధలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కధవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. అదే ఈ ‘అనగనగ ఓ ప్రేమకథ’. మా మావగారు చిత్రసీమలో సుప్రసిద్ధులైన శ్రీ డి.వి.ఎస్.రాజు గారు. ఆయన ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించటమే కాదు, నూతన ప్రతిభా శీలురులను పరిచయం చేసేవారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా హీరో, నాయికలు, దర్శకుడు కూడా కొత్తవారే. అయినా ప్రతిభావంతులు. ఎంతో మందిని పరిశీలించిన తరువాత వీరిని ఎంపిక చేయటం జరిగింది. హీరో అశ్విన్ చక్కని నటుడు. స్టార్ మేకర్ సత్యానంద్ గారు వద్ద నటనలో నైపుణ్య సాధించాడు. నాయికలలో ఒకరైన రిద్ధి కుమార్ కిది నిజానికి తొలిచిత్రం. ఈ చిత్రం ప్రారంభమైన తొలిన్నాళ్లలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మించగా విడుదలైన ‘లవర్’ చిత్రంలో అవకాశం రావటం జరిగింది.
సంగీత దర్శకుడు కె.సి.అంజన్, ఛాయాగ్రాహకుడు ఎదురొలు రాజు లకు కూడా ఇదే తొలిచిత్రం. ఇలా కొత్త వారితో నేను ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న నమ్మకం చిత్రం తొలి కాపీని చూసినప్పుడు, సెన్సార్ వారి ప్రశంసలు అందుకొన్నప్పుడు కలగటమేకాదు, సగటు సినిమా ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం మరింత పెరిగింది. కుటుంబ సభ్యులంతా
కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ప్రేమ కధా చిత్రాలకు ప్రాణం కథ. దానిని నడిపే తీరు, కధకు తగిన సంగీతం, వాటికి తగిన సాహిత్యం, వాటి చిత్రీకరణ, నటీ నటుల అభినయం, సహజంగా సాగే సంభాషణలు ఈ చిత్రానికి ఎంతో చక్కగా సమకూరాయి. అలాగే ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా, లంకావి వంటి ఎన్నో లొకేషన్ లలో
చిత్రీకరణ జరుపుకుంది.
ఇంతకు ముందు చెప్పిందే అయినా ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేశారు. వీరందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు హీరోలు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.యన్.రాజు తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ ,సమర్పణ: సతీష్ రాజు,నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు,కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి