నటుడు విశాల్ ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విశాల్ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అయితే ఈ విషయంలో విశాల్ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు, వాట్సాప్‌లు ఉన్న ఈ కాలంలో కేవలం ఓ లేఖ చూపించి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నామని చెప్పడం సరికాదని అన్నారు.
అంతేకాదు తాను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడం అనైతికమని విశాల్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు తానుగా నామినేషన్ వేశానని, ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్కేనగర్ వాస్తవ్యులకు, నామినేషన్ వేయడంలో తనకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విశాల్ బహిరంగ లేఖ రాశారు.
‘ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేశాను. నాపై ఎవరి ఒత్తిడి లేదు. నేను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురవడం నిజంగా అనైతికం. దీన్ని బట్టి ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో తమిళనాడు ప్రజలు అర్థం చేసుకోవచ్చు’ అన్నారు. ఇప్పుడు తన నామినేషన్ విషయం కంటే దృష్టి సారించాల్సిన విషయాలను చాలా ఉన్నాయని, ముఖ్యంగా తప్పిపోయిన కన్యాకుమారి జాలరులను వెతికి పట్టుకోవడంలో అందరూ సహకరించాలని విశాల్ కోరారు. అలాగే కొత్త ఉత్తేజంతో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నారు.