అందం.. అనుకువ.. ధైర్యం.. తెగువ.. ఇవన్నీ కలగలిసి ఉన్న యువ కలెక్టర్ అమ్రాపాలి. మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినా…ట్రెక్కింగ్ చేస్తూ కొండలెక్కిన ఈ కలెక్టరమ్మకే చెల్లింది. వరంగల్ అర్బన్ జిల్లాను అభివృద్ధి పథంలో నడపడంలో తనవంతు పాత్రను పోషించిన ఆమె ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా అమ్రాపాలికి ప్రమోషన్ వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా అమ్రాపాలి కాటా, అడిషనల్ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు. ఈమేరకు వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వానికి సమాచారం పంపింది కేంద్రం.
వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ప్రజల మెప్పు పొందిన అమ్రాపాలి, పరిపాలనాపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలిచారు. వరంగల్ జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే తన బ్యాచ్‌మేట్ ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను అమ్రాపాలి ప్రేమ వివాహం చేసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.