పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో నమోదైన భారీ ఓటింగ్ శాతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ రికార్డు స్థాయి పోలింగ్ బెంగాల్‌లో “సుపరిపాలన కొత్త శకానికి నాంది” అని ఆయన అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ‘X’ లో స్పందించిన అమిత్ షా, ప్రజాస్వామ్య పండుగలో రికార్డు స్థాయిలో పాల్గొన్న బెంగాల్ ఓటర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “తొలి విడత పోలింగ్‌లో చారిత్రాత్మక ఓటింగ్ ద్వారా అన్ని రికార్డులను తిరగరాసిన పశ్చిమ బెంగాల్ ఓటర్లకు నా ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు.
బెంగాల్ చరిత్రలోనే అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా పోలింగ్ నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘం (ECI), కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) మరియు పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆయన అభినందించారు. ఈ ప్రశాంత వాతావరణం రాష్ట్రంలో రాబోయే మార్పుకు సంకేతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తొలి విడతలో 152 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 91.83 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేశారు. మహిళల ఓటింగ్ శాతం 92.69% గా ఉండగా, పురుషుల ఓటింగ్ 90.92% గా నమోదైంది.ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా 56.79 శాతం మేర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

