ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరణం సాధారణమైనది కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆయన విమర్శించారు.
శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపిన బండి.. ఒక నిబద్ధత గల కార్మికుడు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. శంకర్ గౌడ్ మరణంతో ఈరోజు తెలంగాణ సమాజమంతా కన్నీరు పెడుతోంది అని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారని, వారి గోడును వినేవారే కరువయ్యారని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
గత కొంతకాలంగా ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, పనివేళల్లో మార్పులు, మరియు ఇతర మౌలిక వసతుల కొరతపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ గౌడ్ మరణం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

