Amith Shah:అమిత్ షా రాక..బీజేపీలో జోష్?

30
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తామని కలలు గన్న కాషాయ నేతలకు ప్రజలు షాక్ ఇస్తూ పార్టీని 8 స్థానాలకే పరిమితం చేశారు. మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికి కమలం పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో బీజేపీ హడావిడి కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ 28న పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల తర్వాత మొదటి సారి అమిత్ షా తెలంగాణ వస్తుండడంతో ఆయన పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి గల కారణాలను షా సమీక్షించనున్నారు.

అలాగే మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల ఉండడంతో నేతలను సమాయత్తం చేయనున్నారు. ఇదిలా ఉంచితే బీజేపీలో అధ్యక్ష మార్పుపై ఎన్నికల తర్వాత నుంచి జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న కిషన్ రెడ్డి పార్టీలోని నేతలందరిని ఒకే తాటిపైకి తీసుకురావడంలో విఫలం అయ్యాడని, అందుకే ఎన్నికల్లో కమలం పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసిందనే వాదన ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలతో అమిత్ షా అధ్యక్ష పదవి మార్పుపై చర్చలు జరిపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంచితే పార్టీ కొందరి నేతల మద్య విభేదాలు ఉన్నాయని ఆ విభేదాల కారణంగానే నేతలంతా ఎడమొఖం పెడమొఖం ఉంటున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా పార్టీలో అసంబద్ధత నెలకొన్న నేపథ్యంలో అమిత్ షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. మరి అమిత్ షా పార్టీ పరిస్థితులను ఎంతవరకు చక్కదిద్దుతారో చూడాలి.

Also Read:చలికాలంలో పెరుగు తినవచ్చా?

- Advertisement -