బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ (కౌన్ బనేగా కరోడ్‌పతి) కార్యక్రమం ఎంతో ఆదరణ పొందింది. ప్రస్తుతం కేబీసీ సీజన్ 9కు బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో ఈ సీజన్ ముగియనుంది. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం తనను ప్రజలకు మరింత దగ్గర చేసిందని.. ఇదే సమయంలో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనేలా చేసిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు.
రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారని… బహుశా కొన్ని నెలల పాటు ఈ ఎదురుచూపులు ఫలించకపోవచ్చని ఆయన అన్నారు.అభిమానులకు, ఈ షో కోసం పనిచేస్తున్న ఎంతో మందికి ఇది బాధాకరమైన వార్తే అని చెప్పారు.
ఈ షో కోసం దాదాపు నెల రోజుల పాటు తాను మాట్లాడానని… దీంతో, తన స్వరపేటిక దెబ్బతిందని బిగ్ బీ తెలిపారు. తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నానని… ఆహారాన్ని మింగలేక పోతున్నానని చెప్పారు. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నానని అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఈ షో కోసం 24 గంటలూ కష్టపడుతున్న 450 మంది సభ్యులకు తన అభినందనలు అని చెప్పారు. ప్రస్తుతం అమితాబ్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘102 నాటౌట్’ చిత్రంలోనటిస్తున్నారు. మరో పక్క తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటించనున్నారు.