అక్రమ నిర్మాణాలు చేపట్టారని బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్‌తో పాటు మరికొందరికి ముంబై మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్‌గలీ ఇచ్చిన సమాచారం మేరకు ఈ విషయం బయటపడింది.
మాజీ ఎంపీ కూడా అయిన అమితాబ్ బచ్చన్ గోరేగామ్ ఈస్ట్ లో ఫిలిం సిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తాము అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ తనిఖీల్లో తేల్చారు.
2016, డిసెంబర్ 7న ఈ నోటీసులను అందజేసినట్లు తెలుస్తుంది. అక్రమ నిర్మాణం కోసం మెయిన్ మ్యాప్‌లో మార్పులు చేశారని ఆర్టీఐ కార్యకర్త అనిల్ ఆరోపించారు. నోటీసులు అందుకున్నవారిలో బిగ్‌బీతో పాటు రాజ్‌కుమార్ హిరానీ, ఒబెరాయ్, పంకజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరేశ్ ఖండేల్‌వాలా, హరేశ్ జగ్తానీలు ఉన్నారు.
అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్ శషాంక్ కోకిల్ బిల్డింగ్ డిజైన్ మార్పులకు సంబంధించి కొత్త మ్యాప్‌లను మున్సిపాలిటీకి సమర్పించారు. కానీ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి, పాత ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాలని మే 6వ తేదీన మళ్లీ గ్రేటర్ ముంబై మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా గోరేగావ్‌లో బిల్డింగ్ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త అనిల్ ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ కూడా రాశారు.