అస్సాంలో అక్రమ చొరబాటుదారుల జనాభా భారీగా పెరిగిందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న అస్సాంలోని ధీమాజీ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అక్రమ వలసదారుల సంఖ్య 64 లక్షలకు చేరిందని అన్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ ఇరవై ఏళ్ల పాలనలోనే ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
“ఈ రోజు అస్సాంలో జరుగుతున్న జనసాంఖ్యిక మార్పుల గురించి కూడా మాట్లాడాలి. హిమంత జీ మీరు ఇక్కడ అక్రమ చొరబాటుదారులను అడ్డుకున్నారని చెప్పారు. కానీ మిసింగ్ సమాజం బాధ్యత కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, మొత్తం అస్సాంను అక్రమ చొరబాటుదారుల నుంచి విముక్తం చేయడం. ధుబ్రి, బర్పేటా, దర్రాంగ్, మొరిగావ్, బొంగైగావ్, నాగావ్, గోల్‌పారా అనే ఏడు జిల్లాలు ఈ రోజు అక్రమ చొరబాటుదారుల ఆధిపత్యంలోకి వెళ్లాయి. కాంగ్రెస్ పాలనలోని ఇరవై ఏళ్లలో, గతంలో అక్రమ వలసదారులు లేని ఈ జిల్లాల్లో ఇప్పుడు 64 లక్షల మంది ఉన్నారు,” అని అమిత్ షా అన్నారు.
రాబోయే ఎన్నికల్లో అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆయన అస్సాం ప్రజలను కోరారు.అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవాలంటే యువత ఆయుధాలు పట్టుకుని సరిహద్దులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పని హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం చేస్తుంది. కానీ వారిని ఆపాలంటే రాబోయే ఎన్నికల్లో మరోసారి బీజేపీకి మద్దతివ్వాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని అమిత్ షా అన్నారు.
Also Read:హిమాలయాల్లో ‘ఆపరేషన్ పసిఫిక్’

