బీజేపీ, పశ్చిమ బెంగాల్ అధికారపక్షం టీఎంసీ మధ్య మరింత వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ చర్యలు తీసుకుంది. ఈ నెల 22న తన సమక్షంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని తెలిపింది. 2018 ఆగస్టు 11న అమిత్ షా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు సమన్లు పంపింది. అమిత్ షా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో అభిషేక్ బెనర్జీ విధాన్ నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.
ఈ పిటిషన్ ప్రకారం, ‘‘నారద, శారద, రోజ్ వ్యాలీ, సిండికేట్ అవినీతి, మేనల్లుడి అవినీతి, మమత బెనర్జీ వరుసగా అవినీతికి పాల్పడుతున్నారని అమిత్ షా అన్నారు. ‘‘బెంగాల్ గ్రామీణ ప్రాంతాలవాసులారా, మీ గ్రామానికి డబ్బులొచ్చాయా? గట్టిగా చెప్పండి. డబ్బులు మీ గ్రామానికి వచ్చాయా? ఎక్కడికెళ్ళాయి? ఎక్కడికి? మోదీ ఆ డబ్బులు పంపించారు. రూ.3,59,000 కోట్లు ఎక్కడికెళ్ళాయి? ఆ సొమ్ముని మేనల్లుడికి, సిండికేట్‌కి బహుమతిగా ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి బలిపీఠం దగ్గర ఈ సొమ్మును బలి ఇచ్చారు’’ అని అమిత్ షా చెప్పినట్లు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌లో ఆరోపించారు.