ఇరాన్‌కు చెందిన పెట్రోలియం వాయువు (LPG) అక్రమ రవాణా నెట్‌వర్క్ మరియు షాడో బ్యాంకింగ్ వ్యవస్థపై కొత్త ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం . ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే LPGని ఒమాన్ నుంచి వచ్చినదిగా తప్పుడు పత్రాలతో చూపిస్తూ దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు తరలిస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఈ అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలు, ట్యాంకర్లు, ఆర్థిక మధ్యవర్తులపై అమెరికా ట్రెజరీ శాఖ చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా యూఏఈ, చైనా వంటి దేశాల్లోని ఫ్రంట్ కంపెనీలను ఉపయోగించి లక్షల బ్యారెళ్ల ఇరానియన్ LPGని ప్రపంచ మార్కెట్లకు చేరవేస్తున్నారని పేర్కొంది. ఈ నెట్‌వర్క్ ఇరాన్‌పై ఇప్పటికే అమల్లో ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు విదేశీ బ్యాంకు ఖాతాలు, నకిలీ వ్యాపార లావాదేవీలు, గోప్య ఆర్థిక మార్గాలను వినియోగించిందని వెల్లడించింది. అమెరికా మొత్తం 12 సంస్థలు, ఆరు LPG ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. వీటిలో మార్షల్ ఐలాండ్స్, యూఏఈ, చైనాలో నమోదైన సంస్థలు కూడా ఉన్నాయి.
ఇరాన్‌కు చెందిన మెహ్రదాద్ గెరామియన్ నిక్ అండ్ పార్ట్నర్స్ అనే ఎక్స్చేంజ్ హౌస్‌తో పాటు దాని యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరానియన్ బ్యాంకుల తరఫున వందల మిలియన్ల డాలర్ల విదేశీ కరెన్సీ లావాదేవీలు నిర్వహించినట్లు అమెరికా ఆరోపించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, ఇరాన్‌కు ఆదాయం సమకూర్చే “షాడో ఫ్లీట్” మరియు “షాడో బ్యాంకింగ్” నెట్‌వర్క్‌లను పూర్తిగా దెబ్బతీసేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ చర్యలు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే అవకాశముండగా, అణు కార్యక్రమం మరియు ప్రాంతీయ భద్రత అంశాలపై కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:లోక్‌సభకు మమతా బెనర్జీ!

