ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు..

1
- Advertisement -

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ వారం ప్రారంభంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. శాంతి ఒప్పందం కుదిరి కొద్ది రోజులే అయినప్పటికీ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అమెరికా వైమానిక దళం, నౌకాదళానికి చెందిన యుద్ధ విమానాలు హోర్ముజ్ జలసంధి పరిసరాల్లోని కనీసం 10 ఇరానీ సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు CENTCOM తెలిపింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోను అమెరికా సైన్యం ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్)లో విడుదల చేసింది.

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు జరుగుతుందని గుర్తుచేసిన CENTCOM ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

CENTCOM ప్రకటనలో, “M/V ఎవర్ లవ్లీ నౌకపై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా అమెరికా నిన్న దాడులు చేపట్టింది. అనంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్‌కు ఇచ్చినా, ఈ రోజు ఉదయం 4:30 గంటలకు M/T కికు ట్యాంకర్‌పై వన్-వే అటాక్ డ్రోన్‌తో మరోసారి దాడి చేసింది” అని పేర్కొంది.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “ఇరాన్ ఎప్పటికీ పాఠం నేర్చుకోదు” అని వ్యాఖ్యానించారు. అవసరమైతే అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపడుతుందని, మూడు నెలల క్రితం ప్రారంభించిన ఆపరేషన్‌ను పూర్తిగా విజయవంతం చేస్తామని హెచ్చరించారు. అలాగే, మరోసారి అమెరికా సైనిక చర్యలకు దిగాల్సి వస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.

Also Read:వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు

అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై జరిగిన దాడులకు “చిత్తు చేసే స్థాయిలో ప్రతీకారం” తప్పదని టెహ్రాన్ ప్రకటించింది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం, కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది. అయితే బహ్రెయిన్, కువైట్ ప్రభుత్వాలు ఈ చర్యలను తీవ్రంగా ఖండించాయి.

- Advertisement -