జపాన్ ఈశాన్య ప్రాంతంలోని ఇవాటే (Iwate) తీరానికి సమీపంలో ఆదివారం ఉదయం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ వాతావరణ సంస్థ (JMA) స్పష్టం చేసింది.
JMA వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:25 గంటలకు ఇవాటే తీరానికి సమీపంలో సుమారు 40–41 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనలు ఇవాటేతో పాటు అమోరి (Aomori) ప్రిఫెక్చర్‌లో కూడా బలంగా అనిపించాయి.
భూకంపం తర్వాత వెంటనే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు.
అయితే ఇటీవల ఇదే ప్రాంతంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. బలమైన ప్రకంపనలు నమోదైన ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
జపాన్ ప్రధాని సనయే తకాయిచి మాట్లాడుతూ, సునామీ ప్రమాదం లేదని, పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. నష్టం అంచనా వేయడం, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

