అగ్రరాజ్యంలో ట్రంప్ శకం ..

104
America first says Donald Trump

తన రాక అమెరికా గతిరీతుల్లో భారీ పరివర్తనకు నాంది పలుకుతుందంటూ ప్రచార దుందుభి మార్మోగించిన డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌, ఏడు పదుల వయసులో నలభై అయిదో శ్వేత సౌధాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యమిచ్చి తీరుతానంటు ట్రంప్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అమెరికానే ఫస్ట్‌ , అమెరికన్ల చేతుల మీదుగానే దేశ పునర్నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. అందరి అధ్యక్షుడిగా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఎన్నికవుతానంటూ జోస్యం చెప్పారు.

మాజీ అధ్యక్షులు, ప్రముఖుల సమక్షంలో ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసాంగా సాగింది. దాదాపుగా 9 లక్షల మంది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అధ్యక్ష పదవి కోసం ట్రంప్ తో పోటీ పడిన హిల్లరీ క్లింటన్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. బరాక్ ఒబామా, మిషెల్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం చేయగానే కుటుంబ సభ్యులను హగ్ చేసుకున్నారు. వేదికపై నుంచే 16 నిమిషాల పాటు ట్రంప ప్రసంగించారు.

America first says Donald Trump

ప్రభుత్వాధినేతగా తాను తీసుకునే ప్రతీ నిర్ణయానికి అమెరికా ప్రయోజనాలే పునాదిగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కొద్దిమందికే పరిమితమైన అధికారాన్ని యావత్ అమెరికా ప్రజల చెంతకు తీసుకెళ్తానని తెలిపారు. అమెరికా ప్రజలు తిరిగి దేశ పాలకులుగా మారిన రోజుగా జనవరి 20వ తేదీని గుర్తుంచుకుంటారు. ఇది మీ రోజు. ఇది మీ ఉత్సవ సంరంభం. అమెరికా మీ దేశం. ఈ రోజు మనం అధికారాన్ని వాషింగ్టన్ డీసీ (అమెరికా రాజధాని) నుంచి ప్రజలకు తిరిగి అందజేస్తున్నామని చెప్పారు.

విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని భూమ్మీదే లేకుండా చేస్తానని శపథం చేశారు. వర్ణబేధాలకు తావు లేకుండా దేశాభివృద్ధిలో అమెరికన్లందరూ కలిసి కట్టుగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. తొలిదఫాలో మన ప్రభుత్వం ఎంత బాగా పని చేసిందో ప్రజలు గమనించి మరోసారి మనకే పట్టం కడుతారు అని హర్షధ్వానాల మధ్య జోస్యం చెప్పారు.

America first says Donald Trump

అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు. చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న అబ్రహం లింకన్ బైబిల్‌తోపాటు మరో బైబిల్ మీద తన ఎడమ చేతిని పెట్టి, ట్రంప్ ప్రమాణాన్ని చదివారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణం చేశారు. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన బరాక్ ఒబామా ఆయన భార్య మిషెల్‌పై ట్రంప్ అభినందనలు కురిపించారు.