నేడు ముంబయికి ‘శ్రీదేవి’ పార్థివదేహం..

301
Ambanis plane for Sridevi
- Advertisement -

శ్రీదేవి మరణవార్త తెలిసినప్పటి నుంచి ముంబై అంధేరిలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్ వద్ద (శ్రీదేవి నివాసం) విషాద వాతావరణం ఏర్పడింది. శ్రీదేవి భౌతికకాయం ఇవాళ దుబాయ్ నుంచి ముంబైకి చేరుకోనున్న నేపథ్యంలో అంధేరిలోని అమె నివాసానికి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లు అనుపమ్ ఖేర్, కరణ్ జోహార్, నటులు శిల్పాశెట్టి, రేఖ, రాణిముఖర్జీ, అనిల్ కపూర్, అర్జున్ కపూర్ అంధీరిలోని ఇంటివద్దకు చేరుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ అంధేరికి వచ్చి భోనీకపూర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Ambanis plane for Sridevi

శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక కాయాన్ని పోలీసు ప్రధాన కార్యాలయంలోని శవాగారంలో భద్రపరిచారు. బాధాతప్త హృదయాలతో అభిమానులంతా ఉదయం నుంచే పెద్దఎత్తున శ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

శ్రీదేవి మృతదేహాన్ని ఆదివారం రాత్రికే ముంబయికి తీసుకురావాలని అన్ని ప్రయత్నాలూ జరిగినా శవపరీక్షలో జాప్యంకారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో సోమవారమే మృతదేహాన్ని తరలించనున్నారు. శవపరీక్ష పూర్తయిందనీ, ఫోరెన్సిక్‌ ఆధారాల విభాగం నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల నివేదికలు మాత్రం రావాల్సి ఉందనీ యూఏఈ అధికార వర్గాలు తెలిపాయి. రాత్రి పొద్దుపోయేవరకు దుబాయ్‌ పోలీసుల తుది నివేదికలు సిద్ధం కాలేదు. ఆసుపత్రి వెలుపల ఒక వ్యక్తిమరణిస్తే వివిధ రకాల పరీక్షలు పూర్తయి, నివేదికలు రావడానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. శ్రీదేవి విషయంలోనూ అదే జరుగుతోంది.

Ambanis plane for Sridevi

శ్రీదేవి భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు రిలయన్స్‌కు చెందిన ప్రైవేటు జెట్‌ విమానాన్ని దుబాయ్‌కి పంపించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ముందుకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం ముంబయి నుంచి దుబాయ్‌ వెళ్లింది. శ్రీదేవి పార్థివ దేహంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఈ విమానంలో వస్తారు. సోమవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తున్నా, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.

- Advertisement -