తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ స్పష్టత ఇచ్చారు. పంజాబ్‌లోని పరిస్థితులపై తన అభిప్రాయాలను తన సొంత పార్టీకి (బీజేపీకి) తెలియజేయడం తన బాధ్యత అని అంతమాత్రాన తాను పార్టీని వీడుతున్నట్లు కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను ప్రస్తుతం కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానని పేర్కొన్నప్పటికీ, దాని గురించి మరింత వివరంగా మాట్లాడలేదు.
పంజాబ్ గురించి నా అభిప్రాయాలు మరియు భావాలను పార్టీకి స్పష్టంగా చెప్పడం నా విధి. కాంగ్రెస్ లేదా బీజేపీలో నాకు గుర్తింపు లేదని నేను ఎక్కడా అనలేదు. రాజకీయాల్లో పార్టీలు మారుతుంటాయి. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, ఆపరేషన్ బ్లూ స్టార్ పరిణామాల వల్ల అకాలీదళ్లోకి వెళ్లాను, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌కి తిరిగి వచ్చాను. అంతమాత్రాన ఇప్పుడు బీజేపీని వదిలేసి వేరే పార్టీలో చేరుతానని కాదు అని ఆయన అన్నారు.
మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ జ్ఞాపకార్థం ప్రచురించిన “బిషన్ విత్ లవ్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ…నాకు 84 ఏళ్లు, కానీ మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యే నాటికి ఆయన వయస్సు 92 ఏళ్లు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ…అమరిందర్ సింగ్ మరోసారి పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
Also Read:Asian Games:భారత్‌కు మరో పసిడి
బీజేపీపై మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారు అని ప్రశ్నించగా.. నేను పంజాబ్ రాజకీయాల్లో 60 ఏళ్లు గడిపాను. మా తర్వాత వచ్చిన కొందరు వ్యక్తులు పార్టీలో కనీసం ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు…. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్‌లోని పరిస్థితులను మేము ప్రత్యక్షంగా చూశాం కానీ వారు కనీసం మా సలహా లేదా అభిప్రాయం కూడా అడగడం లేదు” అని అమరిందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

