శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజును మహానవమిగా జరుపుకుంటాం. ఈరోజున ఆయుధ పూజ చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మన దైనందిన జీవితంలో భాగస్వాములైన అన్ని పరికరాలకీ, యంత్రాలకీ పూజ చేస్తాం. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు మహానవమి నాడు తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజిస్తారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే ఫాలో అయిపోయారు. నేడు మహానవమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. అయితే అది ఆయన ఇంట్లో కాదు.. ఊటీలో..
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీలో బన్నీ దేశ సైనికుడిగా కనిపించబోతుండగా.. రీసెంట్ గా యాక్షన్స్ సీన్స్ నిమిత్తం చిత్ర యూనిట్ తో బన్నీ ఊటీకి వెళ్లారు. అక్కడ కొన్ని రోజుల వరకు చిత్రీకరణ జరిపి మళ్లీ హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఈ రోజు చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఆయుధ పూజ చేశారు. దానికి సంబందించిన ఫోటోను బన్నీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేశాడు. అంతే కాకుండా ఆయుధ పూజతో దసరా పండగ మొదలు కాబోతోందని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
కాగా, ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ పేరు ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఓ ఆసక్తి నెలకొంది. విభిన్నమైన చిత్రాలు చేస్తూ.. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే అల్లు అర్జున్ ఈసారి ఏమాయ చేస్తాడని అందరూ చూస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో విశేషం.