సినీ నటుడు అల్లు అర్జున్ ఇటీవలె ఒక కొత్త క్యారవాన్‌ను కొనుక్కున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 6 కోట్లతో తయారు చేసిన ఈ వాహనానికి ఫాల్కన్ అనే పేరు పెట్టారు. సినిమా షూటింగ్ మధ్యలో విశ్రాంతి తీసుకోడానికి, మేకప్ వేసుకోడానికి, ఇతరత్రా అవసరాల కోసం బన్నీ ఈ బస్సును వాడేలా డిజైన్ చేశారు.
అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో మాత్రమే బన్నీ క్యారవాన్‌కు సంబంధించిన ఫోటోలు కనువిందు చేశాయి. అయితే ఈ నెల 16న బన్నీ వాహనం హిమాయత్‌సాగర్ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పై నిషేదం ఉండగా టీఎస్09ఎఫ్జీ 0666 అనే వాహనం అద్దాలు పూర్తిగా బ్లాక్ ఫిల్మ్‌తో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో సిటిజన్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ క్యారవాన్ అల్లు అర్జున్‌కు చెందినదిగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించినందుకు రూ. 735 జరిమానా విధించారు.