ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఇక ఇండియాలో కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలతో కూడిన అనుమతిని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ప్రజలు పాల్గొనకుండా రథయాత్ర జరుపుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ తప్పక పాటించాలని సూచించింది.
కరోనా కారణంగా ఒడిశాలోని జగన్నాథ్ రథయాత్రని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడలేం అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడకుండా ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందని తీర్పు వెల్లడించింది.