హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడానికి బయలుదేరుతున్న తెలంగాణ విద్యార్ధి జేఏసీ బస్సు యాత్రను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అయాచితం శ్రీధర్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా పనిచేశారు. తెలంగాణ హక్కులకోసం విద్యార్ధి విభాగం పనిచేయాలన్నారు. బీజేపీ మోడీ సర్కారు విచ్ఛిన్న తరహా పాలన సాగుతుందని దుయ్యబట్టారు. ఈ మధ్య విడుదల చేసిన గెజిట్ విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది. సీఎం కేసీఆర్ పాలనలో 4 ఏళ్లల్లో కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టు కట్టుకున్నాం. కానీ రాష్ట్రాల అభివృద్దికి కేంద్రం మాత్రం సహకరించడం లేదు. బయ్యారం ఉక్కు, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్న బీజేపీ ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయి అని నారాయణ ప్రశ్నించారు.
మోడీ పాలనలో యూపీలో దళితులపై దాడులు పెరిగాయి.. దళితులను పూర్తిగా అణిచివేతకు గురిచేసేందుకు బీజేపీ చూస్తుంది. రిజర్వేషన్ హక్కులను కూడా కాలరాస్తుంది. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ చెప్పిన పంచ సూత్రాలకు అనుగుణంగా పాలన చేస్తుందని మండిపడ్డారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ఏంటీ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రాల హక్కులను కబళించే ప్రయత్నం చేస్తుంది. రైతాంగంపై కూడా బీజేపీ చిన్న చూపు చూస్తోంది. రైతువ్యతిరేక చట్టాలపై ఢిల్లీ శివారులో ఇంకా రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ జేఏసీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మన హక్కులను కాలరాసే కుట్రలను అణిచివేయాలి అని అల్లం నారాయణ పిలుపునిచ్చారు.
అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. హుజూరాబాద్ నుండే విద్యార్ధి విభాగం పోరుబాట పట్టాలి అన్నారు. ఈ యాత్ర విజయ వంతం కావాలని కోరుకుంటున్నామన్నారు… విద్యార్థి జేఏసీ ఛైర్మెన్ వీరబాబు మాట్లాడుతూ.. ఢిల్లీ అహంకారాన్ని అణిచివేయాలి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. మోడీ సర్కార్ పేదప్రజలను మోసం చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలను మోసం చేస్తుంది. 12 విద్యార్ధి సంఘాలు ఈ బస్సు చైతన్య యాత్రలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్ధి జేఏసీ బస్సు యాత్ర చేపట్టాం. బీజేపీ చేస్తున్న ప్రవేటీకరణపై మరో బస్సు యాత్ర కూడా ఉంటుంది అని తెలిపారు.