గుర్మీత్ రాం రహీం సింగ్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన తరువాత డేరాకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి భయటకు వస్తున్నాయి. సిర్సాలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రాం రహీం సింగ్ అకృత్యాలు కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాలేదు. డేరా సచ్చా సౌధాలో 600 మంది పురుషులు శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుండగా, కొన్ని వేల మంది తాత్కాలిక ప్రాతిపదికన, మరింతమంది అదనంగా స్వచ్చందంగా షిఫ్టులవారీగా పనిచేస్తారని ఆయన మాజీ బాడీ గార్డ్ బియాంత్ సింగ్ తెలిపారు.
వీరందర్లో శాశ్వత ఉద్యోగుల్లో 250 నుంచి 300 మందిని నపుంసకులుగా, శృంగారానికి పనికిరానివారిగా గుర్మీత్ మార్చేశారని ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరికి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా చేయగా, మరికొంత మందికి వృషణాలను తొలగించారని ఆయన తెలిపారు. వారిలో కొందరు ఇంకా అక్కడే పని చేస్తుండగా, కొందరు డేరా వదిలి వెళ్లిపోయారని, మరికొంత మంది విదేశాలకు వెళ్లిపోయారని ఆయన తెలిపారు.